గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపయోగించే విధానం మరియు దుష్ప్రభావాలు – 20 Green Tea Benefits, Uses and Side Effects in Telugu

by

ఈ మధ్య కాలంలో మీరు గ్రీన్ టీ మరియు దాని ఫలితాల గురించి చాలా విని ఉంటారు. గ్రీన్ టీ అంటే ఏమిటి? దీనిలోని రకాలు ఏమిటి? అందరూ గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు, అది నిజమేనా? గ్రీన్ టీ ఎవరు తాగాలి? ఎవరు తాగకూడదు? గ్రీన్ టీ ఎంత తాగాలి? ఎప్పుడు తాగాలి? దీన్ని ఎలా తయారు చేయాలి? ఇలా ఎన్నో అనుమానాలు, సందేహాలు మీకు కలుగవచ్చు. మీ సందేహాలకు సమాధానాలు ఇవిగో!

గ్రీన్ టీ కామెల్లియా సినెన్సిస్ ఆకుల నుండి తయారు చేయబడే టీ. ఇది ఆక్సీకరణ ప్రక్రియకు లోనవుతుంది. గ్రీన్ టీ ఆకులలో అనేక రకాలు ఉన్నాయి. అవి పెరిగే పరిస్థితులు, ఉత్పత్తి ప్రక్రియ మరియు పంట సమయం ఆధారంగా విభిన్నంగా ఉంటాయి.

గ్రీన్ టీ ఎందుకు తాగాలి?

గ్రీన్ టీలో మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలను మెరుగుపరిచే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. మామూలు టీ ఆకులలోని సమ్మేళనాలు చాలావరకు దీనిలో కూడా ఉంటాయి. తరచుగా టీ తాగేవారికి ఇదొక శుభవార్తే కదా!

గ్రీన్ టీలో ఉండే EGCG (ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్) అనే సమ్మేళనం అత్యంత శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనాలలో ఒకటి – ఇది అనేక వ్యాధులకు చికిత్స చేస్తుంది ఇంకా మరెన్నింటినో నిరోధిస్తుంది.

గ్రీన్ టీ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని మించిన ప్రయోజనాలున్నాయి.

గ్రీన్ టీలో గల పోషక విలువలు – Nutritional Value of Green Tea in Telugu

గ్రీన్ టీలో ‘0’ కేలరీలు ఉంటాయి. మీరు కేలరీల గురించి ఆందోళన చెందే వ్యక్తి అయితే, ఇది మీకొక శుభవార్తే! గ్రీన్ టీలోని ఫ్లేవనోల్స్ మరియు కాటెచిన్స్ (పాలీఫెనాల్స్ రకాలు) చాలా గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి.

గ్రీన్ టీలో అత్యంత శక్తివంతమైన సమ్మేళనం EGCG. దీన్ని ఎపిగాల్లోకాటెచిన్ -3-గాలెట్ అని కూడా పిలుస్తారు. ఇది జీవక్రియ రేటు (మెటబాలిజం)ను మెరుగుపరచడం, శరీర బరువును నియంత్రించడం, మరియు ఇన్ఫ్లమేటరీ గుణాలతో పోరాడడంలో మీకు సహాయపడుతుంది.

గ్రీన్ టీలోని ఇతర ముఖ్యమైన సమ్మేళనాలు:

  • క్వర్సెటైన్
  • లినోలెయిక్ ఆమ్లం
  • ఎజినేనిన్
  • మిథైల్క్సాంథైన్స్ (కెఫిన్, థియోపైలిన్ మరియు థియోబ్రోమైన్)
  • అనేక అమైనో ఆమ్లాలు మరియు ఎంజైములు
  • కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థములు) – సెల్యులోజ్, పెక్టిన్స్, గ్లూకోజ్, సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్
  • మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, ఇనుము, క్రోమియం, రాగి మరియు జింక్ వంటి ఖనిజాలు
  • కెరోటినాయిడ్ల గుణాలు
  • లాక్టోన్లు మరియు హైడ్రోకార్బన్లు, ఈస్టర్లు మరియు ఆల్డిహైడ్లు (ఇవన్నీ అస్థిర సమ్మేళనాలు)
  • గ్రీన్ టీలోని పోషక విలువలను చూశాము. ఇప్పుడు ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు – Benefits of Green Tea in Telugu

గ్రీన్ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి, గ్రీన్ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు టీ ఆకుల్లో దాగి ఉన్న ప్రత్యేకమైన సహజ పదార్థ సమ్మేళనాల వల్ల మనకు లభిస్తాయి. గ్రీన్ టీ ఆకులు లేదా పొడిని మరగబెట్టినపుడు కెటెచిన్లు నీటిలో కరిగిపోయి టీ డికాక్షన్ (కషాయం) గా తయారవుతాయి. ఇది సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడి శరీరంలో వాటి మనుగడను కష్టతరం చేస్తాయి. అంతేకాక అంటువ్యాధులను ఎదుర్కోవడంలో గ్రీన్ టీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వేడి వేడిగా మనం తాగే గ్రీన్ టీ యొక్క ఉపయోగాలను ఇపుడు పరిశీలిద్దాం.

గ్రీన్ టీ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు – Benefits of Green Tea For Skin in Telugu

1.చర్మాన్ని తేమగా ఉంచుతుంది

గ్రీన్ టీ లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకుంటే మీ చర్మం మెరుపును సంతరించుకుంటుంది. గ్రీన్ టీ శరీరంలో ఉండే యాంటీఆక్సిడెంట్లను పెంచి, మీ చర్మానికి తేమను ఇచ్చి, ఆకర్షణీయంగా ఉంచుతుంది.

2.మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది

100 గ్రాముల గ్రీన్ టీ ఆకులు, అర లీటరు నీరు కలపండి. ఈ మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రతలో 30 నుండి 40 నిమిషాలు వదిలేయండి. దీన్ని వడకట్టి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుచుకోండి. అలసిపోయిన ముఖాన్ని తక్షణమే రిఫ్రెష్ చేయడానికి మీరు ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మంపై మొటిమలను తగ్గించడానికి మరియు తిరిగి రాకుండా నిరోధించడానికి కూడా సహాయపడుతుంది.

గ్రీన్ టీని రోజూ మీ టోనర్‌కు బదులుగా ఉపయోగించండి. దీని కోసం తాజాగా తయారుచేసిన గ్రీన్ టీని ఐస్ ట్రేలో వేసి గ్రీన్ టీ ఐస్ క్యూబ్ లను తయారుచేయండి. ఈ ఐస్ క్యూబ్‌ను బయటకు తీసి మీ చర్మంపై మృదువుగా రుద్దండి. ఇది మీకు హాయైన అనుభూతిని ఇస్తూ మీ చర్మానికి మేలు చేస్తుంది.

గ్రీన్ టీ ఆకులను సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా, అంటే చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి 1 టీస్పూన్ గ్రీన్ టీ ఆకులలో 3 టీస్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసి నెమ్మదిగా మసాజ్ చేయండి. 5 నిమిషాలు ఉండనిచ్చి గోరువెచ్చని నీటితో కడగండి. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరచి మొటిమలను తొలగించడానికి సహాయపడతాయి.

3. ముఖంపై ముడతలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా చేస్తుంది

గ్రీన్ టీలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తాయి.

ఈ ప్రయోజనం పొందడం కోసం గ్రీన్ టీ మరియు తేనెలతో ఫేస్ మాస్క్‌ చేసి ఉపయోగించవచ్చు.

వాడే విధానం
  • గ్రీన్ టీ ఆకులను తడిపి తేనెతో కలపండి.
  • ఈ ప్యాక్‌ను మీ ముఖంపై రాసి 20 నిమిషాలు అలాగే ఉంచండి.
  • గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
  • గ్రీన్ టీ మరియు తేనె రెండింటిలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. తేనె లోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరిచి, ఆకర్షణీయంగా చేస్తాయి.

4. కమిలిన చర్మానికి చికిత్స చేస్తుంది

గ్రీన్ టీ చర్మానికి సహజ సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ చర్మ కణాల మధ్య స్థిరపడకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. లేకపోతే ఈ ఫ్రీ రాడికల్స్ సన్ బర్న్ మరియు దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు కారణమవుతాయి.

  • ఇంట్లో గ్రీన్ టీ సన్‌స్క్రీన్ చేయడానికి, రెండు కప్పుల నీటిలో అర కప్పు గ్రీన్ టీ ఆకులను వేసి 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి.
  • ఆకులను వేరు చేసి చల్లబరచిన గ్రీన్ టీ ని శుభ్రమైన దూది తో ముఖానికి రాయండి.
  • దీన్ని మీరు తరువాత ఉపయోగించడం కోసం గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయవచ్చు.

5.కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను తగ్గిస్తుంది

కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు మరియు ఉబ్బిన కళ్ళు వంటి సమస్యల పరిష్కారం కోసం గ్రీన్ టీని ఉపయోగించడం చాలా సులభం. మీకు కావలసిందల్లా కొన్ని వాడేసిన గ్రీన్ టీ బ్యాగులు.

వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను ఉబ్బిన కళ్లపై పెట్టడం వల్ల, గ్రీన్ టీ లో ఉండే కెఫిన్ ఈ ప్రాంతంలోని రక్త నాళాలను కుదించడం ద్వారా ఉబ్బడం తగ్గిస్తుంది. మరియు నల్లని వలయాలను తగ్గించడానికి ఇది కళ్ళ క్రింద ఉండే రక్త నాళాలపై పనిచేస్తుంది.

జుట్టుకు గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు- Benefits of Green Tea For Hair in Telugu

జుట్టు పెరుగుదలకు గ్రీన్ టీ

జుట్టు రాలడానికి కారణమయ్యే DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) యొక్క పెరుగుదలను గ్రీన్ టీ నిరోధిస్తుంది. గ్రీన్ టీ లోని పదార్ధాలు టెస్టోస్టెరాన్‌తో చర్య జరుపుతాయి. దీనిలోని క్రిమినాశక లక్షణాల కారణంగా, చుండ్రు మరియు సోరియాసిస్ వంటి సాధారణ జుట్టు సమస్యలను నివారించడానికి మరియు నయం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.

గ్రీన్ టీ జుట్టు పెరుగుదలను ప్రేరేపించి, మృదువుగా చేస్తుంది. అందువల్ల, దీని సహాయంతో బట్టతలని కూడా నిరోధించవచ్చు. ఇందులో పాలీఫెనాల్స్ మరియు విటమిన్లు ఇ మరియు సి ఉన్నాయి, ఇవి జుట్టును మెరిసేలా చేస్తాయి.

వాడే విధానం
  • 3 నుండి 4 గ్రీన్ టీ బాగ్స్ ని అర లీటరు నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చి ఆకులు తీసేసి పక్కన ఉంచండి.
  • జుట్టుకు షాంపూ మరియు కండిషన్ చేసిన తర్వాత చివరిగా ఈ నీటితో శుభ్రం చేసుకోండి.

గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు – Health Benefits of Green Tea in Telugu

1. బరువు తగ్గడం

గ్రీన్ టీలోని EGCG బరువు తగ్గడానికి సహాయపడే మూలకం. అంతే కాక, గ్రీన్ టీ లోని యాంటీఆక్సిడెంట్స్ జీవక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. కొవ్వు కణాల నుండి కొవ్వును కరిగించటానికి గ్రీన్ టీ సహాయపడుతుంది. గ్రీన్ టీలోని సమ్మేళనాలు కొవ్వు కరిగించే హార్మోన్ల ప్రభావాలను పెంచుతాయి.

వ్యాయామం చేసేటప్పుడు, గ్రీన్ టీ కొవ్వు కరిగే వేగాన్ని కూడా పెంచుతుంది. ఇది ఒక అధ్యయనంలో కనుగొనబడింది, వ్యాయామ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల, కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుంది (1).

గ్రీన్ టీ మీ జీవక్రియ రేటును కూడా పెంచుతుంది – అంటే ఇది మీ బేసల్ మెటబాలిక్ రేటు ను కొద్దిగా పెంచుతుంది (2).

2. మెదడును చురుకుగా ఉంచుతుంది

గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది కానీ కాఫీలో ఉన్నంత ఎక్కువ ఉండదు. అందువల్ల, కెఫిన్ యొక్క చెడు ప్రభావాలు లేకుండా ఇది మీకు తగిన ప్రయోజనాలను అందిస్తుంది. మెదడులోని నిరోధక న్యూరోట్రాన్స్మిటర్ అయిన అడెనోసిన్ చర్యలను కెఫిన్ అడ్డుకుంటుంది. ఫలితంగా, ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది (3).

గ్రీన్ టీలో కెఫిన్ కన్నా ముఖ్యమైనది ఎల్-థియనిన్ అనే అమైనో ఆమ్లం, ఇది మెదడుకు పదునుపెడుతుంది. ఈ GABA అమైనో ఆమ్లం చర్యను పెంచుతుంది, మరొక నిరోధక న్యూరోట్రాన్స్మిటర్ (కానీ మంచిది), ఇది యాంటీ-యాంగ్జైటీ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది (5).

3. దంత సంరక్షణకు

గ్రీన్ టీ యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీకున్న దంత సమస్యలను, నోటి దుర్వాసనను పోగొట్టేందుకు ఉపయోగపడవచ్చు. చిగుళ్లవ్యాధులు, దంత సమస్యలు నోటి దుర్వాసనకు ప్రాథమిక కారణాలుగా వైద్యులు సూచిస్తున్నారు. ఒక పరిశోధన ప్రకారం, గ్రీన్ టీలో ఉన్న కాటెచిన్లు మీ నోటిలో హానికరమైన బాక్టీరియాను చంపి, తద్వారా నోటి దుర్వాసన సమస్యను తగ్గిస్తాయి. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారపదార్థాలని తినడం వల్ల వచ్చే నోటి దుర్వాసన సమస్యల్ని గ్రీన్ టీ దూరం చేస్తుంది.

గ్రీన్ టీలో ఫ్లోరైడ్ కూడా ఉంది – ఇది దంత క్షయం నివారించడానికి సహాయపడుతుంది. సాధారణంగా కావిటీస్‌లో కనిపించే స్ట్రెప్టోకోకస్ ముటాన్స్ అనే బ్యాక్టీరియాతో కూడా ఇది పోరాడుతుంది.

4. డయాబెటిస్ (మధుమేహం)

గ్రీన్ టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా గొప్పగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది జీవక్రియ వ్యవస్థ పనితీరును పెంచుతుంది. మరియు గ్రీన్ టీ లోని పాలిఫెనాల్స్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఒక కొరియన్ అధ్యయనంలో 6 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 33% తగ్గించవచ్చు అని తెలిసింది (5). కానీ, ఈ విషయంలో మీ వైద్యుడిని సంప్రదించండి – రోజుకు 6 కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే కెఫిన్ శాతం ఎక్కువ అవుతుంది కనుక అంత సురక్షితం కాకపోవచ్చు.

గ్రీన్ టీ, రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా తగ్గిస్తుందనేది ఒక ఆసక్తికరమైన కథ. పిండి పదార్ధం యొక్క వినియోగం అమైలేస్ అనే ఒక ఎంజైమ్ ద్వారా సాధారణ చక్కెరలుగా మారతాయి. తద్వారా ఇది రక్తప్రవాహంలో కలిసిపోతుంది. గ్రీన్ టీ అమైలేస్ కార్యకలాపాలను నిరోధిస్తుంది – ఇది రక్తప్రవాహంలో కరిగిపోయిన చక్కెర పరిమాణాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

5. రోగనిరోధక శక్తి పెరుగుదలకు

గ్రీన్ టీలోని కాటెచిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. గ్రీన్ టీ మిమ్మల్ని ఆక్సిడెంట్లు మరియు రాడికల్స్ నుండి రక్షిస్తుంది, తద్వారా మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది (6).

గ్రీన్ టీలోని EGCG రెగ్యులేటరీ కణాల సంఖ్యను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇవి రోగనిరోధకతను మెరుగుపరచడానికి మరియు వ్యాధులను అణిచివేసేందుకు సహాయపడతాయి.

6. జీర్ణక్రియకు

గ్రీన్ టీ లోని యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనివల్ల కలిగే అదనపు ప్రయోజనం – బరువు తగ్గడం.

గ్రీన్ టీలోని EGCG పెద్దప్రేగు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. పెద్దప్రేగులో ఇన్ఫెక్షన్ అనేది జీర్ణశయాంతర ప్రేగులలోని వ్యాధి. గ్రీన్ టీ విటమిన్లు బి, సి మరియు ఇ లను కూడా అందిస్తుంది – ఇవి జీర్ణక్రియకు ముఖ్యమైనవి.

కొన్ని జీర్ణశయ క్యాన్సర్ల రేటును తగ్గించడానికి కూడా ఈ టీ ప్రభావవంతంగా ఉంటుందని కనుగొనబడింది.

7. కొలెస్ట్రాల్ తగ్గించడంలో గ్రీన్ టీ పాత్ర

ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు గ్రీన్ టీలో ఉన్నాయని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించవచ్చునని ఆ అధ్యయనం తేల్చింది. బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనాన్ని డెయిలీ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. ఈ అధ్యయనంలో ప్రతీరోజూ గ్రీన్ టీ తీసుకోవడం శరీరంలోని అనవసరమైన కొవ్వు పదార్థాల స్థాయి తగ్గుతుందని తెలిసింది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థాలను గ్రీన్ టీ త్రాగటం ద్వారా కాపాడుకోవచ్చునని యూనియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు వెల్లడించారు. 14 ర్యాండమ్ ట్రయల్స్‌లో గ్రీన్ టీ త్రాగటం వల్ల 7.2 మి.గ్రా. ల కొలెస్ట్రాల్ తగ్గిందని తెలిసింది.

8. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడడానికి

నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ యొక్క యాంటిక్యాన్సర్ లక్షణాలకు పాలీఫెనాల్స్ (ముఖ్యంగా కాటెచిన్స్) బాధ్యత వహిస్తాయి. వీటిలో EGCG కూడా ఉండటం విశేషం. ఇది ఇతర పాలిఫెనాల్స్‌తో పాటు, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. గ్రీన్ టీలోని పాలిఫెనాల్స్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును కూడా అదుపు చేయగలవు (9).

మరొక అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ అనేక రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. వీటిలో ఊపిరితిత్తులు, చర్మం, రొమ్ము, కాలేయం, పెద్దప్రేగు మరియు క్లోమ క్యాన్సర్లు ఉన్నాయి. గ్రీన్ టీలోని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తాయి మరియు వేగంగా కోలుకునేలా చేస్తాయి (10).

ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయకుండా క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగపడే వాటిలో EGCG కూడా ఒకటి. ఆరోగ్యకరమైన కణాల నాశనమే క్యాన్సర్‌ను మరింత బాధాకరంగా చేస్తుంది. త్వరగా కోలుకోవడానికి ఇది ఒక అవరోధం కూడా! ఒక పరిశోధనను బట్టి, రోజుకు 4 కప్పుల గ్రీన్ టీ తాగడం క్యాన్సర్ చికిత్సకు సహాయపడుతుంది (12).

9. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది

గ్రీన్ టీని చాలా కాలం పాటు తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు మెరుగవుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి రోజుకు 3 నుండి 4 కప్పుల టీ తాగడం మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక అధ్యయనంలో పాల్గొన్నవారిలో గ్రీన్ టీ వినియోగం రక్తపోటును తగ్గించింది. తద్వారా, గుండె జబ్బుల ప్రమాదం 5% మరియు స్ట్రోక్ ప్రమాదం 8% తగ్గాయి.

రక్తపోటు సాధారణంగా మూత్రపిండాల ద్వారా స్రవించే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ ( ACE) వల్ల వస్తుంది. గ్రీన్ టీ సహజ ACE నిరోధక పదార్ధం. గ్రీన్ టీ ఈ ఎంజైమ్ యొక్క చర్యను నిరోధించి రక్తపోటును తగ్గించటానికి సహాయపడుతుంది.

10. ఆర్థరైటిస్ నివారణకు లేదా ఎముక పుష్టికి

EGCG యొక్క యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది మీ శరీరంలో ఆర్థరైటిస్ నొప్పికి కారణమయ్యే కొన్ని అణువుల ఉత్పత్తిని తగ్గిసుంది. గ్రీన్ టీ ఎముకలు మరియు మృదులాస్థిల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఆర్థరైటిస్ ఫౌండేషన్ వారి సమాచారం ప్రకారం, ఆర్థరైటిస్ కు యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను అందించేటప్పుడు గ్రీన్ టీలోని EGCG, విటమిన్ సి మరియు ఇ కన్నా 100 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని తేలింది (15).

గ్రీన్ టీలోని EGCG ఇతర సెల్యులార్ ఫంక్షన్లలో జోక్యం చేసుకోకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కలిగే నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని కనుగొన్నారు. ఇది చాలా గొప్ప వార్త, ఎందుకంటే చాలా ఆర్థరైటిస్ మందులలో ఇది ఉండదు.

11. ఆయుర్వృద్ధికి

సాధారణ జపనీస్ ఆహారాన్ని విశ్లేషించిన ఒక అధ్యయనం, గ్రీన్ టీ ఆయుర్దాయాన్ని పెంచుతుందని తేల్చింది. ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేసే వివిధ మార్గాలలో గ్రీన్ టీ ముఖ్యమైనదని చెప్పవచ్చు.

మరో అమెరికన్ అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ దీర్ఘాయువును ప్రోత్సహిస్తున్నప్పటికీ, కాల్షియం కూడా శరీరానికి చాలా ముఖ్యం – గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది, మరియు కెఫిన్ తీసుకోవడం కాల్షియం నష్టానికి దారితీస్తుంది. అందువల్ల తక్కువ మోతాదులో గ్రీన్ టీ తీసుకోవడం మంచిది (16).

12. గుండెజబ్బులకు

హార్వర్డ్ మెడికల్ స్కూల్ యొక్క నివేదిక గ్రీన్ టీ గుండెను ఎలా కాపాడుతుంది, వ్యాధులను ఎలా నివారిస్తుంది అనే విషయాలను తెలిపింది. గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని, గుండె జబ్బులు తగ్గించడంలో నేరుగా సహాయపడుతుందని ఇది పేర్కొంది. గ్రీన్ టీ క్యాప్సూల్స్ ఉపయోగించి చాలా అధ్యయనాలు జరిగాయి (17).

గ్రీన్ టీ కూడా రక్తంలో ఉండే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యాన్ని పెంచుతుందని ఒక అధ్యయనంలో నిరూపించబడింది. ఇది గుండెను రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల నుండి రక్షిస్తుంది మరియు గుండెపోటును నివారిస్తుంది. వాస్తవానికి, గ్రీన్ టీ తాగేవారిలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 31% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు (19).

గ్రీన్ టీలోని కాటెచిన్స్ హృదయసంబంధ వ్యాధుల యొక్క ప్రధాన కారణమైన అథెరోస్క్లెరోసిస్ను నివారించడంలో కూడా సహాయపడతాయి.

13. మానసిక ఆరోగ్యానికి లేదా డిప్రెషన్ నివారణకు

ఒక అధ్యయనం ప్రకారం, ఒక రోజులో 4 కప్పుల గ్రీన్ టీ తాగిన వ్యక్తులు డిప్రెషన్ కు గురయ్యే అవకాశం చాలా తక్కువ. గ్రీన్ టీ యొక్క ఈ లక్షణం దానిలో ఉండే అమైనో ఆమ్లం ఎల్-థియనిన్ వల్ల అని చెప్పవచ్చు, ఇది డిప్రెషన్ తో పోరాడటానికి సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి రసాయనాలను విడుదల చేసేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.

ఎలుకలలో నిర్వహించిన మరో అధ్యయనంలో, గ్రీన్ టీ యాంటిడిప్రెసెంట్ లాగానే ప్రభావాలను చూపింది (20). గ్రీన్ టీలోని కెఫిన్ కూడా డిప్రెషన్ చికిత్సలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది – ఒత్తిడి మరియు ఆందోళనల నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.

14. అల్జీమర్స్

గ్రీన్ టీలోని కెఫిన్, ఎల్-థియనిన్ ఈ రెండూ కలిసి పనిచేస్తే మంచి ప్రభావాలను కలిగిస్తాయి. ఈ శక్తివంతమైన కలయిక మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.

అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధి వంటి తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధుల చికిత్స లేదా నివారణకు గ్రీన్ టీ సహాయపడుతుంది. వారానికి ఒకటి నుండి ఆరు సార్లు గ్రీన్ టీ తాగిన వ్యక్తులలో మానసిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి. గ్రీన్ టీ, పెద్ద వయసులో మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

గ్రీన్ టీలలోని రకాలు – Types of Green Tea in Telugu

గ్రీన్ టీలలో ఎన్నో రకాలున్నాయి. మీ కోసం కొన్ని రకాలు:

  1. సెంచా గ్రీన్ టీ: సెంచా గ్రీన్ టీ జపాన్లో దొరికే అతి సామాన్యమైన టీ. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిగా ఈ గ్రీన్ టీ ఆకులను ఉడికిస్తారు. ఆక్సీకరణను ఆపడానికి ఉడికించన టీ ఆకుల్ని చుట్టలుగా చుట్టి ఎండబెట్టి వాటికి సంప్రదాయ రూపాన్ని ఇస్తారు.
  2. గైకోరో గ్రీన్ టీ: గైకోరో గ్రీన్ టీ తయారీలో టీ ఆకుల్ని కోసేందుకు 20 రోజులు ముందుగానే టీ మొక్కల్ని ఒక బట్టతో కప్పి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఈ ఆకులు మరింత సువాసనాభరితంగా తయారవుతాయి. గ్రీన్ టీ ఆకుల్లో కాటెచిన్ల సంఖ్యను తగ్గించేందుకు ఇలా బట్ట కప్పుతారు.
  3. కబుసేచా గ్రీన్ టీ: ఈ గ్రీన్ టీ మొక్క గైకోరో గ్రీన్ టీ మాదిరిగానే పెరుగుతుంది కానీ, దీన్ని ఒక వారం రోజులపాటు మాత్రమే బట్టతో కప్పుతారు .
  4. మాచా గ్రీన్ టీ: “తెన్చా” అని పిలవబడే మరొక రకపు గ్రీన్ టీ పొడిని “మాచా గ్రీన్ టీ” అని అంటారు. తెన్చా టీ మొక్క గైకోరో గ్రీన్ టీ మొక్కలాగానే నీడలో పెరుగుతుంది, కానీ బట్టతో మొక్కను కప్పే సమయం 20 రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఆకులను రోలింగ్ చేయకుండా ఎండబెడతారు. తెన్చా టీని రవాణా చేయటానికి ముందు పొడిగా మారుస్తారు.
  5. చైనీస్ గన్పౌడర్ టీ: ఈ టీ తయారీలో టీ ఆకుల్ని ఉడకబెట్టిన తర్వాత ఓ ప్రత్యేకమైన రూపంలో చుడతారు. దీనికి ఓ ప్రత్యేకమైన పొగకు- సంబంధించిన వాసన ఉండడం వల్ల దీనికి “చైనీస్ గన్పౌడర్ టీ” అనే పేరు స్థిరపడింది.

గ్రీన్ టీని తయారుచేసే పద్ధతి – How to Prepare Green Tea in Telugu

  1. మొదటి పద్ధతి: ఓ 2-3 గ్రాముల గ్రీన్ టీ ఆకుల్ని ఒక పాత్రలో వేయండి. ఆ పాత్రలో మరిగే వేడి వేడి నీటిని పోయండి. 1 – 2 నిమిషాల పాటు గ్రీన్ టీ ఆకుల్ని వేడి వేడి నీటిలో బాగా ఉడకనివ్వండి. ఇపుడు వేడి వేడిగా ఈ గ్రీన్ టీ ని తీసుకోండి.
  2. రెండవ పధ్ధతి: ఒక కప్పు వేడినీటిలో గ్రీన్ టీ బ్యాగ్ “డిప్” చేసుకొని గ్రీన్ టీని ఆస్వాదించవచ్చు.

గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం – When to Drink Green Tea in Telugu

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకున్నప్పుడు గ్రీన్ టీ నుండి వెలువడే పదార్దాలు మన శరీరానికి విషపూరితంగా తయారవుతాయట.

అందువల్ల గ్రీన్ టీని ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో లేదా సాయంత్రం తీసుకోండి. ఈ సమయంలో తాగటం వలన శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది.

గ్రీన్ టీ వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Green Tea in Telugu

  1. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. అందువల్ల, గ్రీన్ టీ తీసుకొనేవారికి ఆందోళన, నిద్రలేమి మరియు విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  2. కొన్ని సందర్భాల్లో, గ్రీన్ టీని అధికంగా తీసుకొనేవారిలో కాలేయ సంబంధిత రోగాలు వచ్చినట్లు తెలిసింది. అయితే, ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకున్నప్పుడు మాత్రమే గ్రీన్ టీ నుండి వెలువడే పదార్దాలు మన శరీరానికి విషపూరితంగా తయారవుతాయట. కానీ, కొన్ని ఇతర పరిశోధనలు గ్రీన్ టీ అసలు కాలేయానికి విషకారకం కానే కాదని సూచిస్తున్నాయి. అందువల్ల, మీకు ఇప్పటికే కాలేయ వ్యాధులు ఉన్నట్లయితే, గ్రీన్ టీ తీసుకునే ముందు మీ వైద్యులని సంప్రదించడం మంచిది.
  3. గ్రీన్ టీకి ఇతర మందులు లేక మూలికలతో కలిసి ప్రతి చర్య చెందే గుణం ఉంది గనుక, మీకు రక్తహీనత ఉంటే గ్రీన్ టీని త్రాగకుండా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే గ్రీన్ టీ త్రాగే వారిలో తిన్న ఆహారం నుండి మనదేహానికి కావాల్సిన ఇనుము పూర్తిగా విడుదల కాకుండా ఇది అడ్డుపడుతుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.
  4. గ్రీన్ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది గనుక డయాబెటిక్ (మధుమేహం) మందులను వాడుతున్నవారు గ్రీన్ టీని ఏ మోతాదులో తీసుకోవాలో వైద్యులని అడగటం మంచిది.
  5. గ్రీన్ టీ ని రోజూ 2 కప్పుల కంటే ఎక్కువ తీసుకుంటే మీ శరీరంలోని కాల్షియంను బయటకు పంపేస్తుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడవచ్చు. కాబట్టి, గ్రీన్ టీని తక్కువగా తీసుకోవడమే మంచిది.
  6. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ త్రాగటం వల్ల ప్రమాదం లేదు. కానీ, గ్రీన్ టీ లో కెఫిన్ ఉంది కాబట్టి గర్భవతులు తక్కువగా తీసుకోవడం మంచిది. కాబట్టి, మీరు గర్భవతి అయితే, ఈ విషయం గురించి మీ వైద్యులతో మాట్లాడటం మంచిది.
  7. గ్రీన్ టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది గనుక పిల్లలకు ఇవ్వడం అంత మంచిది కాదు.

చూసారా? గ్రీన్ టీ ఎంత ప్రభావవంతమైన సహజ ఆహారమో! మీ అనుమానాలన్నీ తీరాయా? మరి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ గ్రీన్ టీ త్రాగటం ఎప్పుడు మొదలుపెడుతున్నారు? మీ అనుభవాలను తెలియజేయడానికి క్రింది కామెంట్ బాక్స్ లో తప్పక కామెంట్ చేయండి!

Was this article helpful?
scorecardresearch